నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నికలు

తెలంగాణలోని దుబ్బాకతో సహా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో 58 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్‌ కేంద్ర ఎన్నికల కమీషనర్‌ సునీల్ అరోరా మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. నవంబర్‌ 3వ తేదీన 56 స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్‌లోని రెండు శాసనసభ స్థానాలకు, బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 7వ తేదీన ఎన్నికలు జరుపుతామని తెలిపారు. కానీ నాలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాటిలో 7 శాసనసభ స్థానాలకు వచ్చే ఏడాది నిర్వహిస్తామని తెలిపారు. 

రెండు రోజుల క్రితమే బిహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్‌ ఎన్నికల ఫలితాలతో పాటు ఈ 58 శాసనసభ స్థానాలు, ఒక్ లోక్‌సభ స్థానానికి జరుగబోయే ఎన్నికల ఫలితాలను నవంబర్‌ 10న ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమీషనర్‌ సునీల్ అరోరా తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున నేటి నుంచే 13 రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సునీల్ అరోరా స్పష్టం చేశారు. 

ఉపఎన్నికలు జరుగబోయే 58 స్థానాలలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 27 స్థానాలున్నాయి. మిగిలినవి తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్, హర్యానా, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.

ఎన్నికల షెడ్యూల్: 

 నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 

నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 

ఉపసంహరణ చివరి తేదీ:  అక్టోబర్ 19 

పోలింగ్ తేదీ : నవంబర్ 3 

కౌంటింగ్ తేదీ నవంబర్:  10