కాంగ్రెస్‌కు మళ్ళీ ఫిరాయింపుల సమస్య

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వాటికి ముందూ తరువాత కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపులు సర్వసాధారణమైన విషయమైపోయింది. ఎన్నికల ముందు టిఆర్ఎస్‌ వారిని నయన్నో భయన్నో తమ పార్టీలో చేర్చుకొంటే, ఎన్నికల  తరువాత కాంగ్రెస్‌ తరపున పోటీ చేసినవారు టిఆర్ఎస్‌లో చేరిపోవడం పరిపాటిగా మారిపోయింది. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నందున మళ్ళీ కాంగ్రెస్‌లో నుంచి టిఆర్ఎస్‌లో ఫిరాయింపులు మొదలయ్యాయి. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి తదితరుల ప్రోత్సాహంతో ఎల్లారెడ్డి జెడ్పీటీసీ ఉషాగౌడ్, నిజామాబాద్‌ 37వ డివిజన్ కార్పొరేటర్ కె.ఉమారాణి, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఆరో వార్డు కౌన్సిలర్‌ సంగని బాలమణి టిఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్ధి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు సందీప్ గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకొన్నారు. 

సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొనేందుకే తామందరం టిఆర్ఎస్‌లో చేరామని వారు చెప్పారు.  సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌పై నమ్మకం, అభిమానంతో వారందరూ టిఆర్ఎస్‌లో చేరినందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.