బిహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

కేంద్ర ఎన్నికల కమీషన్‌ శుక్రవారం మధ్యాహ్నం బిహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 243 స్థానాలు కలిగిన బిహార్‌ శాసనసభకు మూడు దశలలో ఎన్నికలు నిర్వహించబడతాయి. నవంబర్‌ 29వ తేదీతో బిహార్ శాసనసభ గడువు ముగుస్తుంది కనుక ఆలోపుగానే ఎన్నికల ప్రక్రియ ముగించి ఫలితాలను ప్రకటించవలసి ఉంటుంది. కనుక అక్టోబర్ 28 నుంచి నవంబర్‌ 7వరకు మూడు దశలలో ఎన్నికలు నిర్వహించి నవంబర్‌ 10వ తేదీన ఫలితాలు ప్రకటించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కనుక నేటి నుంచే బిహార్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. బిహార్‌లో అధికార జేడీయూ, బిజెపి, ఎల్జీపీలు ఒక కూటమిగా, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఒక కూటమిగా పోటీ చేయబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని తెలిపింది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించింది.     

ఎన్నికల షెడ్యూల్ : 

మొదటి దశ: అక్టోబర్ 28న పదహారు జిల్లాలోని 71 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 

రెండో దశ: నవంబర్‌ 3న  పదిహేడు జిల్లాలోని 94 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.  

మూడవ దశ: నవంబర్‌ 7న పదిహేను జిల్లాలోని 78 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

మొదటి దశ నామినేషన్లు: అక్టోబర్ 1 నుంచి 8వరకు. 

నవంబర్‌ 10న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 

కరోనా నేపధ్యంలో ఈసారి ఎన్నికలకు అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్‌ తెలిపింది. 

గత శాసనసభ ఎన్నికలలో 65,000 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా ఈసారి లక్ష పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. క్వారెంటైన్‌లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రత్యకంగా సమయం కేటాయించింది. వారు సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంటుంది. కోవిడ్ బారిన పడినవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తునట్లు తెలిపింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు, మిగిలిన ప్రాంతాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంద ఎన్నికల కమీషన్ తెలిపింది.