
రైల్వే సహాయమంత్రి సురేష్ అంగడి (65) బుదవారం రాత్రి ఢిల్లీలో కరోనాతో మృతి చెందారు. సుమారు 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ బుదవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కనుమూశారు.
సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావి నుంచి బిజెపి తరపున లోక్‌సభకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఆయనకు కీలకమైన రైల్వేశాఖకు సహాయమంత్రి పదవి లభించింది. సురేష్ అంగడి మృతితో దేశంలో ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కరోనాతో మృతి చెందారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కరోనా బారినపడి గత నెల 31న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బిజెపి నేతలు, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు సురేష్ అంగడి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా గురువారం ఒక్కరోజు న్యూఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయజెండాను అవనతం చేసి ఉంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.