తెలంగాణలో అమలులోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదముద్ర వేశారు. గవర్నర్‌ ఆమోదం కూడా పొందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న దాని కోసం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కనుక ఇక నుంచి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమలుకాబోతోంది. రెవెన్యూ శాఖలో ఇకపై దాని ప్రకారమే నియమనిబందనలు అమలుచేయవలసి ఉంటుంది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు శాసనసభ ఆమోదించిన బీ-పాస్ చట్టం, ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం, జీఎస్టీ సవరణ చట్టం, పురపాలక, పంచాయితీరాజ్ చట్ట సవరణలు కూడా రాష్ట్రంలో అమలుకి వచ్చినట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది కనుక సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా రెవెన్యూశాఖ అవినీతిరహితంగా, పారదర్శకంగా, చురుకుగా పనిచేస్తే రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషిస్తారు.