.jpg)
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు నేటితో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృవీకరించారు. శాసనసభ సమావేశాలను నేటితో ముగిద్దామని ప్రభుత్వం నుంచి మాకు ప్రతిపాదన వచ్చింది. కానీ కృష్ణా జలాల వివాదంపై సభలో చర్చించిన తరువాతే ముగించాలని మేము సూచించాము,” అని మీడియాకు చెప్పారు.
మొదట ఈనెల 28వరకు శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహిద్దామని బీఏసీ నిర్ణయించింది. కానీ కరోనా నేపధ్యంలో నేటితో ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు పోలీసులు, శాసనసభ సిబ్బందితో సహా రోజుకు సుమారు 1,000-1,100 మందికిపైగా విధులకు హాజరుకావలసివస్తోంది. కరోనా సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ ప్రతీరోజు వారిలో కొందరు కరోనా బారినపడుతూనే ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో సహా అన్ని బిల్లులకు శాసనసభ, మండలి ఆమోదముద్ర వేశాయి కనుక నేటితో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్న శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మజ్లీస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలతో శాసనసభ సమావేశాల వాయిదా గురించి చర్చించారు. కనుక నేటితో శాసనసభ, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది.