
ఏపీ, తెలంగాణలో అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులను నడిపే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నేడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోకి కరోనా ప్రవేశించక మునుపు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సుమారు 1,000 బస్సులు తెలంగాణ రాష్ట్రంలో 2.65 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండేవి. అదే...టీఎస్‌ఆర్టీసీకి చెందిన 750 బస్సులు ఏపీలో 1.44 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండేవి. దాని వలన ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో బాగానే ఆదాయం సమకూర్చుకోగలుగుతోంది కానీ టీఎస్‌ఆర్టీసీ ఆ మేరకు నష్టపోతోంది. కనుక రెండు రాష్ట్రాలలో సరిసమాన కిలోమీటర్లు నడిపించుకొందామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించగా దానిని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. దానికి బదులు తాము తెలంగాణలో 50,000 కిమీ సర్వీసులు తగ్గించుకొంటామని, టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 50,000 కిమీ సర్వీసులు పెంచుకోవాలని ప్రతిపాదన చేశారు. కానీ దాని వలన కూడా టీఎస్‌ఆర్టీసీకి ప్రయోజనం ఉండకపోగా ఇంకా నష్టపోవచ్చు. ఎందుకంటే ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో ఆదాయం తక్కువగా వచ్చే ప్రాంతాలలో సర్వీసులు తగ్గించుకొంటుంది తప్ప అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే హైదరాబాద్ వంటి నగరాలను వదులుకోదు. ఇక టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ఏపీలో గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు నగరాలకే తిరుగుతుంటాయి. వాటికి కూడా ఏపీఎస్ ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి గట్టి పోటీ ఉంటుంది. కనుక ఆ ప్రాంతాలకు అదనంగా మరిన్ని బస్సులు వేసి నడిపించడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక ఏపీలోని కడప, ప్రకాశం, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం వంటి కొన్ని జిల్లాలకు తెలంగాణ జిల్లాల నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిప్పినా వాటికి ఆదరణ లభించదు.
అందుకే టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమానదూరం నడిపించుకొందామని పట్టుపడుతున్నారు. దాంతో ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి బస్సులు నడుపుతూ మంచి ఆదాయం సమకూర్చుకొంటున్న ఏపీఎస్ ఆర్టీసీ తన ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్దపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని అర్ధమవుతోంది. కానీ అందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరిస్తారా అంటే అనుమానమే.