
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 1వరకు సమావేశాలు కొనసాగుతాయి. అయితే కరోనా నేపధ్యంలో ఈసారి ఉభయసభలు వేర్వేరు సమయాలలో సమావేశమవుతాయి. రాజ్యసభ సమావేశాలు ప్రతీరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లోక్‌సభ సమావేశాలు ప్రతీరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు, జరుగుతాయి.
ఇవాళ్ళ ఒక్కరోజు లోక్‌సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతాయి.
పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు, పార్లమెంటు అధికారులకు, ఉద్యోగులకు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులకు అందరికీ కరోనా పరీక్షలు చేసి కరోనా లేదని నిర్ధారించుకొన్న తరువాతే లోపలకు అనుమతిస్తారు. కరోనా నేపధ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీల హాజరును డిజిటల్ విధానంలో నమోదు చేస్తారు.
సమావేశాలు జరుగుతున్నని రోజులు ఉభయసభలను శానిటైజ్ చేసేందుకు 40 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. సభ వాయిదా పడిన ప్రతీసారి వారు ఉభయసభలను పూర్తిగా శానిటైజ్ చేస్తుంటారు.
లోక్‌సభలో సుమారు 130 మంది, రాజ్యసభలో సుమారు 97 మంది 65 ఏళ్ళు పైబడినవారున్నారు. ఉభయసభలలో 75 ఏళ్ళు పైబడినవారు 50 మందికి పైగా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షఫికర్ రహ్మాన్ బర్క్ వయసు 86 ఏళ్ళు. పార్లమెంట్ సభ్యులలో కేంద్రమంత్రులతో సహా పలువురు ఎంపీలు కరోనా బారినపడి కోలుకొన్నవారున్నారు. కనుక పార్లమెంట్ సమావేశాలలో ఎవరికీ కరోనా సోకకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.