తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ రామచంద్ర కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాకూర్‌ నియమించబడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగా తెలంగాణకు మాణిక్యం ఠాకూర్‌ ఇన్‌-ఛార్జ్ గా నియమించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పార్టీ టికెట్లు అమ్ముకొన్నారని కుంతీయాపై పలువురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయననే పదవిలో కొనసాగిస్తుండటంపై పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు కుంతియాను తొలగించడమే కాక కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీలో శాస్విత ఆహ్వానితునిగా కూడా తప్పించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసి చాలాకాలం అయినందున రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలలో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్‌ రెడ్డి వంటి సీనియర్లు ఆ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సోనియా గాంధీ పిసిసి అధ్యక్ష పదవి జోలికి పోకుండా కేవలం కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ ని మార్పుతో సరిపెట్టారు. బహుశః త్వరలోనే కొత్త పిసిసి అధ్యక్షుడుని నియమిస్తారేమో చూడాలి. 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ గా నియమితులైన మాణిక్యం ఠాకూర్‌ తమిళనాడులో విరుద్ నగర్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో ఏవిధంగా వ్యవహరిస్తారో, ఆయనతో పార్టీ నేతలు ఏవిధంగా వ్యవహరిస్తారో, ఆయన సిఎం కేసీఆర్‌ను...దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.