
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో అన్ని రకాల భూములు, ఇళ్ళు క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు శాసనసభలో కొత్త రెవెన్యూచట్టం ప్రవేశపెట్టబోతున్నందున ఈ నిర్ణయం తీసుకొంది. మరింత మెరుగైన, సరళమైన, పారదర్శకమైన నూతన విధానాలు అమలుచేయబోతున్నందున తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సోమవారం నుంచి అన్ని రకాల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీలునామాలు, రిజిస్టర్డ్ మ్యారేజీలు, ఫ్రాంక్లిన్ సేవలు యధాతధంగా కొనసాగుతాయని ఉత్తర్వులలో పేర్కొంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినందున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోతుంది. కనుక వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టానికి శాసనసభ, మండలిలో...ఆ తరువాత గవర్నర్ చేత ఆమోదముద్ర వేయించుకోవలసి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందగానే చట్టం అమలులోకి వస్తుంది. అంతవరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి ఉంచవలసిరావచ్చు.