
నేటి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు మొదలవనున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణనించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, మరికొందరు మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి వారికి నివాళులు అర్పించిన తరువాత ఆ తీర్మానాలను ఆమోదిస్తారు. వాటితో మొదటిరోజు సమావేశాలు ముగుస్తాయి. తరువాత సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసి) సమావేశమై ఉభయసభల పనిదినాలు, సభలో చర్చించవలసిన అంశాలను ఖరారు చేస్తుంది. బీఏసీ నిర్ణయించిన ప్రకారం మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెలాఖరువరకు సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ్ళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉభయసభలలో అనుసరించవలసిన వ్యూహాలను వివరిస్తారు.
అనంతరం రాత్రి 7.30 గంటలకు సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గసమావేశమవుతుంది. రేపు శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టబోయే కొత్త రెవెన్యూ చట్టం, ఇతర బిల్లులపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు.