త్వరలో బిహార్ శాసనసభ ఎన్నికలు.. దుబ్బాకకు కూడా

కరోనా భయంతో అన్నీ స్తంభించిపోయాయి... వాటిలో ఎన్నికలు కూడా ఒకటి. తెలంగాణలో దుబ్బాకతో సహా  దేశవ్యాప్తంగా మొత్తం 64 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతున్నాయి. అయితే బిహార్ శాసనసభ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది కనుక ఆలోగా తప్పనిసరిగా శాసనసభ ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కనుక వాటితో పాటు ఉపఎన్నికలను కూడా అక్టోబర్-నవంబర్‌ నెలల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ (ఈసీ)నిర్ణయించింది. త్వరలోనే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటిస్తామని నిర్వహించాలని ఈసీ చెప్పింది.

బిహార్ శాసనసభలో 243 స్థానాలున్నాయి. వాటిలో సిఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 69, బిజెపి-54, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జెడీకి-74, కాంగ్రెస్‌-26, మిగిలిన స్థానాలలో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులున్నారు. 

ప్రస్తుతం బిజెపి మద్దతుతో జెడియూ అధికారంలో కొనసాగుతోంది. కనుక బిహార్‌లో జెడియు, బిజెపి, ఎల్‌జేపీలు ఒకవైపు, ఆర్‌జెడీ, కాంగ్రెస్ పార్టీలు మరోవైపు ఉన్నాయి. ఈ ఎన్నికల రణరంగంలో ఆ రెండు కూటముల మద్య యుద్ధం జరుగబోతోంది. 

తెలంగాణలో దుబ్బాక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఉపఎన్నికలు జరుగనున్నాయి. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ఆ సీటు కేటాయించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనుక టిఆర్ఎస్‌లో ఆ సీటు కోసం పోటీ ఉండదు. కానీ కాంగ్రెస్‌, బిజెపిలలో చాలా మంది నేతలు ఈ ఉపఎన్నికలను పదవి సంపాదించుకోవడానికి ఓ మంచి అవకాశంగా భావిస్తున్నందున, దుబ్బాక సీటు కోసం ఆ రెండు పార్టీలలో గట్టి పోటీయే ఉండవచ్చు. ఉపఎన్నికలు అక్టోబర్-నవంబర్‌ నెలలో జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించేసింది కనుక ఆ రెండు పార్టీలలో ఆశావాహుల హడావుకి కూడా మొదలైపోతుంది.