
కరోనా పరీక్షలు, లెక్కల విషయంలో హైకోర్టు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ కేసులపై శుక్రవారం విచారణ చేపట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్ళీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స పేరిట రోగులను నిలువుదోపిడీ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు వాటిపై చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఎప్పటిలాగే కరోనా కేసులు, మరణాలను తగ్గించి చూపేందుకు తప్పుడు లెక్కలు ప్రకటిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రోజుకు 8-10 మంది మాత్రమే కరోనాతో చచ్చిపోతున్నారంటే నమ్మశఖ్యంగా లేదని, ప్రభుత్వం తీరు మారకపోతే మళ్ళీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ను హైకోర్టుకు రప్పించవలసి వస్తుందని హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి వరకు ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? మార్చి నుంచి నేటి వరకు ఎంత ఖర్చు చేసిందో వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆసుపత్రులలో మౌలికవసతులు లేక ప్రజలు, మాస్కూలు, పీపీఈ కిట్లు గ్లౌజులు లేక ఆసుపత్రి సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, వాటిపై ఈనెల 24న జరుగబోయే తదుపరి విచారణలోపుగా ప్రభుత్వం నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.