
ఈ నెల 7 నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో అనవసరమైన విమర్శలు, వాదోపవాదాలకు తావీయకుండా సభను హుందాగా అర్ధవంతంగా నడిపిద్దామని సిఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. కానీ శాసనసభ సమావేశాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా సమస్యలపై గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కనుక ఈ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై కరోనా అస్త్రాలను ప్రయోగించడానికి సిద్దం అవుతోందని అర్ధమవుతోంది. దానికి అవసరమైన అస్త్రశస్త్రాలను సమకూర్చుకొనేందుకే గత వారం రోజులుగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు రాష్ట్రంలోని కరోనా ఆసుపత్రులను సందర్శిస్తూ వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు.
దేశంలో చాలా రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగా ఉందని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ, తగినన్ని కరోనా పరీక్షలు చేయకుండా, రోగులను ఆసుపత్రులలో చేర్చుకొని చికిత్స చేయకుండా, కరోనా కేసులను, మరణాలను దాచిపుచ్చుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచేసరికి కరోనా కేసులు కూడా గణనీయంగా పెరగడం కాంగ్రెస్ వాదనలను బలం చేకూర్చుతోంది. కనుక ఈసారి శాసనసభ సమావేశాలలో అధికార ప్రతిపక్షాల మద్య కరోనా పరీక్షలు, కరోనా కట్టడి, నివారణ, కరోనా చికిత్స, ఆసుపత్రులలో సౌకర్యాలు, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు తదితర అంశాలపై చాలా వాడివేడిగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేసిన కొత్త రెవెన్యూ చట్టంపై కూడా సభలో అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కీసర మండలం రాంపల్లి దయారాలో భూవివాదంలో సెటిల్మెంట్ చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ల నుంచి కీసర తహశీల్దార్ నాగరాజు కోటి పది లక్షలు లంచం తీసుకొంటుండగా ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు సంబందం ఉందన్నట్లు తహశీల్దార్ నాగరాజు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రభుత్వానికి ఆపాదించి తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయిందటూ విమర్శలు చేయడం, వాటిని టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం కూడా ఖాయమే. కనుక ఈసారి కూడా శాసనసభ సమావేశాలు ఎప్పటిలాగే చాలా వాడివేడిగా సాగే అవకాశాలే ఎక్కువున్నాయి.