మేడ్చల్ కలెక్టర్, కీసర ఆర్డీవోలు చెపితేనే వెళ్ళాను: నాగరాజు

కీసర మండలం రాంపల్లి దయారాలో భూవివాదంలో సెటిల్మెంట్ చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ల నుంచి కోటి పది లక్షలు లంచం తీసుకొంటుండగా కీసర తహశీల్దార్ నాగరాజు ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. అతను ఏసీబీ విచారణలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరు ఉన్నతాధికారుల పేర్లు బయటపెట్టడంతో కలకలం మొదలైంది. 

“ఈ భూవివాదం గురించి అంజిరెడ్డి, శ్రీనాథ్‌లతో మాట్లాడి సెటిల్ చేయమని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరులు, కీసర ఆర్‌డీవో రవి నాకు చెప్పారు. వారు చెప్పినందునే నేను ఆగస్ట్ 14వ తేదీన డ్యూటీ ముగిసిన తరువాత కాప్రాలోని అంజిరెడ్డి ఇంట్లో వారిరువురినీ కలిశాను. వారితో నేను ఈ భూవివాదం గురించి చర్చిస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి మమ్మల్ని పట్టుకొన్నారు. నిజానికి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ వివాదాస్పద భూములపై అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు ఎటువంటి యాజమాన్యపు హక్కులు లేవు. కానీ వారితో మాట్లాడి సెటిల్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్, కీసర ఆర్‌డీవో చెప్పడం వలననే నేను వారిని కలిశాను,” అని నాగరాజు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ భూవివాదం కేసులో హన్మకొండ తహశీల్దార్ కిరణ్ ప్రకాష్ పేరు కూడా బయటకు వచ్చింది. ఏసీబీ అదుపులో ఉన్న  శ్రీనాథ్‌ ఈ విషయం బయటపెట్టాడు. తన స్నేహితుడైన హన్మకొండ తహశీల్దార్ కిరణ్ కుమార్ తనకు కీసర్ తహశీల్దార్ నాగరాజును పరిచయం చేశాడని చెప్పాడు. 

దీంతో ఈ భూవివాదం...దాని సెటిల్మెంట్ కోసం ముట్టజెప్పిన కోటి పదిలక్షల లంచం వ్యవహారంలో తెర వెనుక మరికొంతమంది ఉన్నారనే అనుమానాలు మొదలయ్యాయి. 

అయితే మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరులు, కీసర ఆర్‌డీవో రవి ఇద్దరూ దీనిని ఖండించారు. 

జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరులు స్పందిస్తూ, “ఈ భూవివాదం...లంచంతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. సాధారణంగా భూవివాదాలు... మ్యూటేషన్ ప్రక్రియ తహశీల్దార్ స్థాయిలోనే జరుగుతుంటుంది. ఒకవేళ ఎవరైనా నాకు అర్జీ పెట్టుకొంటే నేను దానిని పరిశీలించి అన్నీ నిబందల ప్రకారం ఉన్నట్లయితే ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా నా కింద పనిచేసే అధికారులకు పంపిస్తుంటాను తప్ప నేరుగా ఏ ఫైలు నాదగ్గరకు రాదు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా నన్ను ఇందులో ఇరికించాలని చూస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాను. నాపై జరిగే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు స్పందించవలసిన అవసరం లేదు. కానీ దీని వలన నా ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించి స్పందిస్తున్నాను,” అని చెప్పారు. 

కీసర కీసర ఆర్‌డీవో కూడా ఇంచుమించు ఇదేవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, రాంపల్లి దయారాలో భూవివాదానికి సంబందించిన ఫైలు అసలు తన వద్దకు రానేలేదని కనుక ఆ భూవివాదం గురించి తనకు తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎటువంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.