ఈ నెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు షురూ

ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కరోనా నేపధ్యంలో ఈసారి మద్యలో వారాంతపు శలవులు తీసుకోకుండా వరుసగా 18 రోజులు సమావేశాలు నిర్వహించి ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

పార్లమెంటు సమావేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు హాజరవుతారు కనుక కరోనా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక పార్లమెంటులో అన్ని జాగ్రత్తలు, భౌతికదూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యేవారికి ప్రతీరోజు ధర్మల్ స్కానింగ్, అవసరమైతే ర్యాపిడ్ టెస్టులు చేసి కరోనా లేదని నిర్ధారించుకొన్న తరువాతే సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు. 

ఈసారి సమావేశాలలో ప్రతిపక్షాలు కరోనా సంబందిత అంశాలు, సమస్యలు, కరోనా నివారణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానాస్త్రాలుగా కేంద్రప్రభుత్వంపై ప్రయోగించవచ్చు. సరిహద్దులలో చైనాతో ఉద్రిక్తతలపై కూడా ఈసారి అధికార, ప్రతిపక్షాల మద్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యావ్యవస్థలో మార్పులకు సంబందించి బిల్లులపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులెవరికీ కరోనా వైరస్‌ సోకకుండా సమావేశాలు నిర్వహించడమే కత్తి మీద సామువంటిదని చెప్పవచ్చు.