
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈవిషయం స్వయంగా ట్విట్టర్ ద్వారా దేశప్రజలకు తెలియజేశారు. మూడు వారాల క్రితం మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్ ముఖర్జీ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. ఆ సందర్భంగా వైద్య పరీక్షలు చేసినప్పుడు ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ విషయం ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. త్వరలోనే కొలుకొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కానీ కరోనా సోకడంతో ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తరువాత డీప్ కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు కానీ ఆయన ఆరోగ్యపరిస్థితి నానాటికీ క్షీణిస్తూనే ఉంది. ఇవాళ్ళ సాయంత్రం ఆయన పరిస్తితి మరింత విషమించడంతో కోమాలో ఉండగానే తుదిశ్వాస విడిచారు.
అజాతశత్రువుగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎంత బలమైన అనుబందం ఉందో, ప్రధాని నరేంద్రమోడీతో సహా అన్ని పార్టీల నేతలతోను మంచి స్నేహసంబందాలున్నాయి.
ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలియజేస్తూ నేటి నుంచి ఏడు రోజులు దేశవ్యాప్తంగా సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయపతాకాన్ని అవనతం చేశారు.
ప్రణబ్ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు వివిద రాజకీయ పార్టీల నేతలు, వివిద రంగాల ప్రముఖులు ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.