1.jpg)
తెలంగాణలో ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇక నుంచి డీసీపీ స్థాయి పోలీస్ అధికారి రాజాసింగ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. ఆయన ఇంటివద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు భద్రత పెంచుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ చెప్పారు. రాజాసింగ్ తరచూ తన అనుచరులతో కలిసి ద్విచక్రవాహనంపై నగరంలో పర్యటిస్తుంటారు. ఆయనకు ప్రాణహాని ఉన్నందున ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే ప్రయాణించాలని, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగరక్షకులను వెంటబెట్టుకొని వెళ్లాలని అంజనీ కుమార్ సూచించారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ, “ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు కానీ నాకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో తెలియస్తే బాగుంటుంది. నాపై దాడి చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో నాకు తెలిస్తే నేను మరింత అప్రమత్తంగా ఉండగాలను కదా? అందుకే ఆ వ్యక్తుల వివరాలు తెలియజేయాలని కోరుతూ త్వరలోనే కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు లేఖ వ్రాసి కోరుతాను,” అని అన్నారు.
ఘోషామహల్ నుంచి బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్‌పై చాలా ఆవేశపరుడిగా, హిందూ అతివాదిగా పార్టీలోపల, బయటా కూడా ముద్ర పడిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఆయనకు చాలా మంది శత్రువులుండటం సహజమే. ఆ శత్రువులెవరో ఆయనకు కూడా తెలుసు కనుక మళ్ళీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను అడగవలసిన అవసరమే లేదు.