జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఇంకా అనేకమంది విద్యార్ధులు కూడా పిటిషన్లు వేశారు. అయితే ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం జరుపవలసిందేనని సుప్రీంకోర్టు చెపుతోంది. కనుక కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు పరీక్షలు వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. ఈ అంశంపై ఇంతవరకు తెలంగాణ సిఎం కేసీఆర్ స్పందించకపోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తప్పు పట్టారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ తెలంగాణలో 67,319 మంది జేఈఈ, 55,800 మంది విద్యార్దులు నీట్ పరీక్షలు వ్రాయబోతున్నారు. కానీ సిఎం కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప వారి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ పరీక్షలు వాయిదా వేయాలని పోరాడుతుంటే సిఎం కేసీఆర్ బిజెపి ముఖ్యమంత్రులలాగా మౌనం వహించడానికి అర్ధం ఏమిటి?పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా వాటికి హాజరయ్యే విద్యార్దులకు, వారి స్నేహితులకు, వారి ద్వారా వారి కుటుంబాలకు, చుట్టుపక్కల నివశిస్తున్నవారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కనుకనే కరోనా తీవ్రత తగ్గేవరకూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాము. కానీ సిఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటూ పరోక్షంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.
పరీక్షల నిర్వహణ అంటే కేవలం 3 గంటల తంతు కాదు. ఎక్కడెక్కడో నివశిస్తున్న విద్యార్దులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు తిరగడం లేదు కనుక ఆటోలు, లేదా సొంత వాహనాలపైనే రావలసి ఉంటుంది. దారిలో ఎక్కడైనా ఎవరిద్వారానైనా విద్యార్దులకు కరోనా అంటుకొనే ప్రమాదం ఉంటుంది. పరీక్షా కేంద్రాలలో కూడా కరోనా అంటుకొనే ప్రమాదం ఉంటుంది. కనుక లక్షలాది మంది విద్యార్దుల జీవితాలను, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాము. సిఎం కేసీఆర్ కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పరీక్షలు వాయిదా వేయించడానికి కృషి చేయలి,” అని అన్నారు.
అయితే ఈ విషయంలో సిఎం కేసీఆర్ మౌనం అంగీకారానికి సూచనగా భావించవచ్చు కనుక కాంగ్రెస్ సూచనను ఆయన పట్టించుకోకపోవచ్చు.