టిడిపి శాసనసభా పక్షనేత అచ్చెన్నాయుడికి బెయిల్‌పై మంజూరు

ఆంధ్రప్రదేశ్‌ టిడిపి శాసనసభా పక్ష నేత కింజారపు అచ్చెనాయుడికి ఏపీ హైకోర్టు శుక్రవారం రూ. 2 లక్షల సొంత పూచీకత్తుపై బెయిల్‌పై మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని సూచించింది. 

అచ్చెనాయుడు టిడిపి ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ళు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జూన్‌ 12వ తేదీన ఏపీ ఏసీబీ అరెస్ట్ చేసింది. అంతకు రెండు రోజుల ముందే శస్త్రచికిత్స చేయించుకొని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తన ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్న అచ్చెనాయుడిని అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్ళారు. వైసీపీ ప్రభుత్వం ఆయనను మానసికంగా, శారీరికంగా వేధించేందుకే ఆవిధంగా చేసిందంటూ టిడిపి నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు.

విజయవాడ చేరుకొనే సరికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గుంటూరులో ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆ తరువాత మళ్ళీ జైలుకు తరలించినప్పుడు ఆయనకు కరోనా సోకింది. దాంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను రమేష్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ్ళ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందగానే ఆయనను ఆసుపత్రి నుంచి విడిచిపెడతారు.