ఆ కరోనా లెక్కలను మేము నమ్మము: ఉత్తమ్‌కుమార్ రెడ్డి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుదవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే ప్రభుత్వం కరోనా కేసులు, మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. ప్రభుత్వం చెపుతున్న కరోనా లెక్కలను మేము నమ్మడం లేదు. సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళేందుకు భయపడుతున్నారంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకే మేము సీఎల్పీ నేతృత్వంలో రాష్ట్రంలో కరోనా ఆసుపత్రులన్నిటినీ సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొంటాము. 

ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స పేరు చెప్పి రోగులను, వారి కుటుంబ సభ్యులను పీడించి లక్షలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలు అటు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజులు భరించలేక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది?కరోనా కట్టడి విషయంలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూసి సిఎం కేసీఆర్‌ నేర్చుకొంటే బాగుంటుంది,” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.