మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాక ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం పై విసుర్లు చిందడం సాధారణమే, అందులో రేవంత్ రెడ్డి విసుర్లు అత్యంత సాధారణమే. అయితే ఇక్కడ అసాధారణమైన విషయమేంటంటే చాలా కాలం తర్వాత నిజామాబాద్ ఎంపీ కవిత ఈ విసుర్లకు గట్టిగా స్పందించడం.
ఈరోజు మీడియా ముందు కవిత మాట్లాడుతూ, "ప్రాజెక్ట్ కు తెలంగాణ రాష్ట్రం ఒక పక్క, మహారాష్ట్ర మరో పక్క ఉన్నప్పుడు, ఒప్పందం మహారాష్ట్ర తో కుదుర్చుకుంటాం గాని, ఆంధ్ర ప్రదేశ్ తో కాదు. కనీసం రేవంత్ రెడ్డి కి ఇది కూడా తెలియకపోవడం చింతించదగ్గ విషయం", అని అన్నారు.
మరో పక్క ఎల్ రమణ పై తనదైన స్టైల్ లో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కవిత, "మహారాష్ట్ర తో ఒప్పందం బదులు, కేంద్రంతో మాట్లాడి మహారాష్ట్ర లోని భూమి లాక్కోమని రమణ చెప్పారు. అది చంద్రబాబు నాయుడు పాటించే పద్ధతి. కానీ తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్రం వాళ్ళు కూడా బాగుండాలని, అవసరమైతే చేయూతనివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుందని" తెలిపారు.
నిజానికి చూస్తే ఇందులో కవిత కౌంటర్ల పవర్ కన్నా, ప్రత్యర్ధుల బలహీనతే ఎక్కువ కనబడుతుంది. పసలేని ఆరోపణలు చేసి సులువుగా రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కి కౌంటర్ లు ఇప్పించుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు సరైన పేపర్ వర్క్ లేనిదే, ఎటాక్ కు సిద్ధం కావొద్దని తెలుసుకోవాలి.