ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు పాజిటివ్

కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు జాజాల సురేందర్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన వెంటనే హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన సురేందర్ గత ఏడాది మార్చిలో కేటీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు. నేటికీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నప్పటికీ టిఆర్ఎస్‌లో చేరినందున ఆయనను అధికారపార్టీకి చెందినవారిగా భావించవలసి ఉంటుంది. ఇటీవల ఆయన రామారెడ్డి మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు ఎవరి ద్వారానో కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనల మేరకు ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు.