ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై వాహనాలకు అనుమతి

సచివాలయం కూల్చివేత కోసం సుమారు నెలరోజులకు పైగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌లపై వాహనాల రాకపోకలను నిషేదించారు. కూల్చివేత పనులు దాదాపు పూర్తికావడంతో నేటి నుంచి రెండు ఫ్లై ఓవర్‌లపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 

సచివాలయం వైపుగా సాగే ఫ్లై ఓవర్‌లను మూసివేయడంపై నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూల్చివేత పనులు జరుగుతుంటే ఫ్లై ఓవర్‌లను మూసివేయవలసిన అవసరం ఏమిటి? దానిలో అంత రహస్యం ఏముంది? అని చాలామంది ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు కానీ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పారు. సచివాలయం జీ బ్లాకు నేలమాళిగలో నిజాం నవాబులకు చెందిన గుప్తనిధులు ఉన్నాయని సిఎం కేసీఆర్‌ వాటిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అటువైపు ఎవరినీ వెళ్ళనీయకుండా కాపలాపెట్టి అర్ధరాత్రిపూట రహస్యంగా కూల్చివేత పనులు కొనసాగించారని, అందుకే మీడియాను కూడా అక్కడికి అనుమతించడం లేదని ఆరోపించారు. అయితే రేవంత్‌ రెడ్డి ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని ఏడవ నిజాం నవాబు మనుమడు స్పష్టం చేశారు. హైకోర్టు కూడా ప్రభుత్వం తీరును ఆక్షేపించడంతో ప్రభుత్వం హడావుడిగా మీడియాను అక్కడకు తీసుకువెళ్ళి 15 నిమిషాలలో తిరిగి పంపించేసింది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ నెలరోజుల తరువాత రెండు ఫ్లై ఓవర్‌లపై వాహనాలను అనుమతించడంతో నగరవాసులు చాలా సంతోషిస్తున్నారు.