ప్రముఖ రాజకీయ నేత, ఎంపీ అమర్ సింగ్‌ మృతి

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ప్రముఖనేత అమర్ సింగ్‌ (64) శనివారం మధ్యాహ్నం సింగపూర్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలల క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకొన్నారు. కానీ అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో సింగపూర్‌కు వెళ్ళి అక్కడి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి క్రమంగా ఆయన పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం కనుమూశారు. 

సమాజ్‌వాదీ పార్టీలో ఆయన కీలకనేతగా ఉండేవారు. చనిపోయే సమయానికి ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. పదేళ్ళ క్రితం ఆయన, ఎంపీ జయప్రదలపై సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అప్పటి నుంచి వారిరువురి రాజకీయజీవితాలు బాగా దెబ్బ తిన్నాయి. 

ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉండే అమర్ సింగ్‌ ఈరోజు మధ్యాహ్నం చనిపోయే కొన్ని గంటల ముందు చివరిగా లోకమాన్య బాలగంగాదర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్‌లో నివాళులు అర్పించారు.