డొనాల్డ్ ట్రంప్‌ కోరిక తీరేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన మనసులో మాటను ఇవాళ్ళ చల్లగా బయటపెట్టారు. దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున ఈ పరిస్థితులలో అమెరికా పౌరులు నిర్భయంగా బయటకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం కష్టం కనుక నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలను కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుందని అన్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో మెయిల్-ఇన్‌-ఓటింగ్ చేపడితే చాలా మోసాలు జరిగే ప్రమాదం ఉంటుంది కనుక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగకపోవచ్చునని కనుక ఎన్నికలు వాయిదా వేయడమే మంచిదని ట్రంప్‌ అన్నారు. 



ట్రంప్‌ చెప్పిన కారణం సరైనదే కానీ ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. డోనాల్డ్ ట్రంప్‌ నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నా కూడా కరోనా మహమ్మారిని సకాలంలో గుర్తించి అడ్డుకోవడం అలసత్వం ప్రదర్శించడం వలననే నేడు అమెరికాకు ఈ దుస్థితి పట్టిందని ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా బలంగా నమ్ముతున్నాయి. కరోనా వైరస్ విశ్వరూపం చూపిన తరువాత కూడా ట్రంప్‌ ప్రభుత్వం దానిని అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైందని డెమొక్రాట్లు గట్టిగా వాదిస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. అదీగాక లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడటంతో ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రజలలో కూడా ట్రంప్‌ ప్రభుత్వం పట్ల ఆగ్రహం, విముఖత ఏర్పడి ఉంటాయి. వీటన్నిటికీ చైనాను బాధ్యురాలిగా చేసి అమెరికన్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. ఇటువంటి పరిస్థితులలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే ఏమవుతుందో ట్రంప్‌కు బాగా తెలుసు. బహుశః అందుకే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకొంటున్నారని  భావించవచ్చు. 

కానీ అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను వాయిదా వేయడానికి వీలులేదు. ఒకవేళ వాయిదా వేయాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. అది ట్రంప్‌ ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కనుక ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో మెయిల్-ఇన్‌-ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించక తప్పకపోవచ్చు. కానీ ట్రంప్‌ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తునందున ఆయన చేసిన ఈ తాజా సూచనతో అమెరికాలో కొత్త చర్చ మొదలవుతుంది.