
రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఉప్పల్ చౌరస్తా కూడా ఒకటి. అక్కడ నిత్యం వేలాదివాహనాలు తిరుగుతుంటాయి. అయితే మన సిగ్నలింగ్ వ్యవస్థలలో పాదచారులు రోడ్లు దాటడానికి ప్రత్యేకమైన ఏర్పాటు లేదు కనుక రివ్వున దూసుకుపోయే ఆ వాహనాల మద్యనే రోడ్లు దాటవలసివస్తోంది. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం, వాటిలో ప్రజలు గాయపడటమో లేదా ప్రాణాలే కోల్పోవడమో జరుగుతుంటుంది. ఉప్పల్ చౌరస్తాలో ఈ సమస్యకు పరిష్కారంగా స్కై వాక్ నిర్మించాలనే ప్రతిపాదనకు జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది. ఉప్పల్ చౌరస్తాలో వరంగల్-హైదరాబాద్, సికింద్రాబాద్-ఎల్బీ నగర్ ప్రధానరహదారులు కలిసే చోట 660 మీటర్ల పరిధిలో ఉప్పల్ మెట్రో స్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మిస్తామని మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. దీనిని 12 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే పాదాచారులు సురక్షితంగా రోడ్లు దాటవచ్చని చెప్పారు.