ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ సోమవారం ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం మేరకు ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. 

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తరువాత పలువురు కాంగ్రెస్‌ నేతలు వైసీపీ, టిడిపి, బిజెపిలలో చేరిపోయారు. వారిలో కన్నా లక్ష్మినారాయణ కూడా ఒకరు. ఆయన బిజెపిలో చేరగానే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేజిక్కించుకొన్నారు. నిజానికి మొదటి నుంచి బిజెపిలో ఉన్న సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి లభిస్తుందనుకొంటే, పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం అడ్డుపడటంతో కన్నా లక్ష్మీనారాయణకు ఆ అవకాశం దక్కింది. అయితే కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారనే వాదనలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. అదీగాక ఆయన ఏపీలో పార్టీని దూకుడుగా నడిపించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక చాలా చురుకుగా వ్యవహరించే సోము వీర్రాజుకు పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పగించినట్లు భావించవచ్చు. 

సోము వీర్రాజు టిడిపిని, చంద్రబాబునాయుడును చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ సంక్షేమ పధకాలతో దూసుకుపోతున్న వైసీపీని ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. ముఖ్యంగా రాజధానిని అమరావతిని విశాఖకు తరలించాలనే జగన్ ప్రభుత్వ ఆలోచనపై రాష్ట్ర బిజెపిలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ అంశంపై సోము వీర్రాజు ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలి.