స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు

కరోనా నేపధ్యంలో ఈఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఈసారి చాలా పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తారు. ఆ కార్యక్రమాన్ని యధాప్రకారం టీవీ ఛానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు ఈసారి వెబ్‌ క్యాస్టింగ్ ద్వారా కూడా ప్రసారం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు కూడా కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో చాలా పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతించాలని సూచించింది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కరోనాతో ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్, మునిసిపల్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని గౌరవించాలని సూచించింది. జిల్లా, మండల స్థాయిలో కూడా ఇదేవిధంగా చేయాలని కోరింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌ మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనేవారికి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.