
కరీంనగర్ శివార్లలో నిర్మించిన ఐటి టవర్‌ను ఐటి శాఖమంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. రూ.25 కోట్లు వ్యయంతో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తులతో ఇది నిర్మించబడింది. దీనిలో కార్యాలయాలు ప్రారంభించేందుకు 26 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 15 కంపెనీలకు కేటాయింపులు పూర్తయ్యాయి. వాటిలో 12 కంపెనీలు ఐటి టవర్ ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటి టవర్‌లో అన్ని కంపెనీలన్నీ తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే వాటి ద్వారా సుమారు 3,600 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మీడియాకు తెలిపారు.
ఐటి టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో శిక్షణ కేంద్రం, మొదటి అంతస్తులో కార్యాలయం, మిగిలిన అంతస్తులలో ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తారు. వాటిలో మూడు, నాలుగు అంతస్తులలో ప్రసిద్ధి చెందిన ఐటి కంపెనీలకు కేటాయిస్తారు.
ఇప్పటివరకు ఐటి కంపెనీలలో ఉద్యోగం కోసం తప్పనిసరిగా హైదరాబాద్ లేదా బెంగళూరుకు వెళ్ళవలసి వచ్చేది. ఈ సమస్యను ఎప్పుడో గుర్తించిన ఐటి శాఖమంత్రి కేటీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఐటి టవర్స్ నిర్మింపజేస్తున్నారు. తద్వారా యువత స్థానికంగానే ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఐటి కంపెనీలు ఏర్పడినట్లయితే హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆ ప్రాంతాలు కూడా హైదరాబాద్‌తో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందుతాయి.
ఇప్పటికే వరంగల్‌లో మడికొండవద్ద ఏర్పాటు చేసిన ఐటి పార్కులో పలు ఐటికంపెనీలు కార్యకలాపాలు మొదలుపెట్టాయి. వాటిలో అనేకమందికి ఉద్యోగాలు లభించాయి. సమీపంలోనే రెండో దశ ఐటి పార్క్ నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయి. ఇవి కాక రాష్ట్రంలో ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాలలో కూడా రూ.25 కోట్లు వ్యయంతో ఒక్కో ఐటి టవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఐటి టవర్ పనులు ఇంకా మొదటిదశలో ఉండగా, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో పనులు దాదాపు పూర్తికావచ్చాయి.