తెలంగాణలో కరోనాను అద్భుతంగా కట్టడి చేస్తున్నాం: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణం, గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక తదితర అంశాల గురించి గవర్నర్‌కు వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను చాలా సమర్ధంగా ఎదుర్కొంటోందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉందని కనుక ఆందోళన చెందనవసరంలేదని తెలిపారు. కరోనా రోగులకు పరీక్షలు, చికిత్స చేసేందుకు ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని, కానీ కొంతమంది వాటి గురించి తెలియక ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని సిఎం కేసీఆర్‌ గవర్నర్‌కు చెప్పారు. రాష్ట్రంలో కొందరు పనికట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం వలన ప్రజలలో అపోహలు ఏర్పడుతున్నాయని చెప్పారు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉంది పోరాడుతున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. 

పాత సచివాలయం సౌకర్యవంతంగా లేదని అందుకే హైకోర్టు అనుమతితో దానిని కూల్చివేసి రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. 

గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయవిధానానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో హరితహారం పధకంలో భాగంగా కోట్లాది మొక్కలు వేస్తున్నామని తెలిపారు.     

గవర్నర్‌ తమిళిసై సూచనలు: 

1. రాష్ట్రంలో జిల్లాకో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయండి. 

2. ప్రైవేట్ ఆసుపత్రులలో దోపిడీని అరికట్టండి. దాని కోసం ఓ కమిటినీ ఏర్పాటు చేయండి. 

3. ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న బెడ్లు, వెంటిలేటర్లు వగైరా వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయండి.  

4. కరోనా పరీక్షల సంఖ్య పెంచండి. 

5. ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నవారికి వారి ఇళ్ల వద్దే కరోనా పరీక్షలు నిర్వహించండి. దానికోసం మొబైల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయండి.