1.jpg)
ఉస్మానియా ఆసుపత్రి వార్డులలోకి డ్రైనేజీ నీళ్ళు ప్రవహించడంపై అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం ఘాటుగా విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, “ కాంగ్రెస్ నేతలు అల్జీమర్స్ వ్యాధి సోకి గతం మరిచిపోయినట్లు మాట్లాడుతున్నారు. సిఎం కేసీఆర్ 2015లో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని నిర్ణయిస్తే, బిజెపి, కాంగ్రెస్ నేతలు, వారి బినామీలు హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుపడ్డారు. ఆ సంగతి మరిచిపోయి ఇప్పుడు కొత్త భవనం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నిస్తుండటం చూస్తే వారికి అల్జీమర్స్ ఉందేమోనని అనుమానం కలుగుతోంది. హైకోర్టులో వారు వేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకొంటే ఏడాదిలోపుగా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగకూడదు... ప్రజలకు మేలు కలగకూడదు...వారు ఎప్పుడూ బాధలు పడుతూనే ఉండాలి...సిఎం కేసీఆర్కు మంచిపేరు రాకూడదు... అని కోరుకొనే ప్రతిపక్షాలు ఎప్పుడూ మా ప్రభుత్వంపై బురద జల్లెందుకే ప్రయత్నిస్తున్నాయి. కరోనాతో ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బిజెపి నేతలు మరింత ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నారు. యూపీలో ఆక్సిజన్ అందక 63 మంది పసిపిల్లలు చనిపోతే కాంగ్రెస్, బిజెపి నేతలకు యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు కానీ ఇక్కడ ప్రతీ చిన్నవిషయానికి హడావుడి చేస్తుంటారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కాంగ్రెస్, బిజెపి నేతలు సైంధవుడిలా అడ్డుకొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కరోనా కంటే ప్రమాదకరమైన వాళ్ళు,” అని అన్నారు.