సిఎం కేసీఆర్‌పై ఉత్తమ్ విమర్శలు

ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఉస్మానియా ఆసుపత్రి నీట మునగడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.  సచివాలయం కూల్చివేసి కొత్తది కట్టాలనుకొంటున్న సిఎం కేసీఆర్‌కి శిధిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు కట్టాలనే ఆలోచన కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో కరోనాను గొప్పగా కట్టడి చేశామని గొప్పలు చెప్పుకొనే సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ వదిలిపెట్టి ఫాంహౌసుకి ఎందుకు వెళ్ళిపోయారు? సిఎం కేసీఆర్‌ వైఖరి వలనే నేడు హైదరాబాద్‌ నగరాన్ని కరోనా చుట్టుముట్టేసింది. పొరుగు రాష్ట్రం ఏపీలో చాలా భారీ సంఖ్యలో రోజూ కరోనా పరీక్షలు చేయిస్తుంటే తెలంగాణలో నామమాత్రంగా చేయిస్తూ కరోనా కేసులను తెలంగాణ ప్రభుత్వం దాచిపెడుతోంది. కరోనాను నియంత్రించడంలో సిఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేవలం రబ్బర్ స్టాంపులాగా వినియోగించుకొంటున్నారు తప్ప ఆయనకు ఏ నిర్ణయాలు తీసుకొనేందుకు అధికారాలు లేవు. సామాన్య ప్రజలకు ఇటు ప్రభుత్వాసుపత్రులలో అటు ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనాకు చికిత్స చేయించుకోలేక చాలా బాధలు పడుతున్నారు. కనుక ఇకనైనా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలి. కొత్త సచివాలయం కట్టే డబ్బుతో పేదప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.