
దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్నాయి. కనుక కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహాయసహకారాలు నిరంతరంగా అందజేస్తూనే ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటికీ పరవాలేదనిపిస్తున్నా కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో త్వరలోనే తీవ్ర సమస్యను ఎదుర్కోకతప్పదని స్పష్టమవుతోంది. కనుక కరోనాను ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి మరింత సహాయసహకారాలు కావలసి ఉంటుంది. అయితే కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల మొదటి నుంచి సవతితల్లి ప్రేమనే కనబరుస్తోందని, పైగా కరోనాను కట్టడిచేయడంలో విఫలమైందంటూ కేంద్రమే తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాటిపై రాష్ట్ర బిజెపి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మురళీధర్ గౌడ్ స్పందిస్తూ, “కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 7.14 లక్షల పీపీఈ కిట్లు, 2.90 లక్షల ఆర్టీ పీసీఆర్ కిట్లు, 1.22 లక్షల ఆర్‌ఎన్‌ఎ కిట్లు, 52,000 వీటిఎం కిట్లు, 1220 వెంటిలేటర్లు, 7.14 లక్షల ఎన్-95 మస్కూలు, 23 లక్షల హెచ్‌సీయూ మాత్రలు పంపించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వివిద పధకాల అమలు కోసం రూ.4,849 కోట్లు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇంతగా సహాయసహకారాలు అందజేస్తున్నప్పటికీ కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్రం ఏమీ చేయడంలేదంటూ విమర్శిస్తుండటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకే కేంద్రంపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తోందని మేము భావిస్తున్నాము. ఇకనైనా అటువంటి ఆలోచనలు మానుకొని రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసి ప్రజలను కాపాడేందుకు గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.
బుదవారం పెద్దపల్లిలో జిల్లా బిజెపి అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో మురళీధర్ గౌడ్, పిన్నిటి రాజు, కొంతమ్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రావు, ఫయాజ్, వనిత తదితర బిజెపి నేతలు పాల్గొన్నారు.