
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ నర్సులు నేటి నుంచి నిరవధిక సమ్మె మొదలుపెట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. జీతాల పెంపుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది కానీ రెగ్యులరైజ్ చేసేందుకు సముఖంగా లేదని సమాచారం.
ఒకేసారి కాంట్రాక్ట్ పారిశుద్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ నర్సులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండటంతో గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఆసుపత్రి లోపల ఎక్కడికక్కడ వార్డులలో చెత్త పేరుకుపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఓ కరోనా రోగి మృతి చెందాడు. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మె చేస్తుండటంతో అతని శవాన్ని తొలగించేవారులేక మంచం మీదనే సుమారు 8 గంటలు ఉండిపోయింది. దాంతో పక్కనే ఉన్న కరోనా రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాకు పొక్కడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెంటనే సిబ్బందిని పంపించి అక్కడి నుంచి శవాన్ని మార్చురీకి తరలింపజేశారు.
సమ్మెకు సిద్దమైన కాంట్రాక్ట్ పారిశుద్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ నర్సులతో మంగళవారం సాయంత్రం డీఎంఓ చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ అవి విఫలం అవడంతో నేటి నుంచి నిరవధిక సమ్మె మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో గాంధీ ఆసుపత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో కాంట్రాక్ట్ పారిశుద్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మె మొదలుపెట్టడంతో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పడుతుంది. కనుక ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.