6.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారనివాసం ప్రగతి భవన్లో 30 మంది సిబ్బందికి కరోనా సోకడంతో గజ్వేల్లోని తన సొంత ఇంటికి వెళ్లిపోవడంతో ప్రతిపక్షాలకు సిఎం కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం కలిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి హైదరాబాద్లో జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికొదిలేసింది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుంటే, కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. కరోనాను ఎదుర్కోవడానికి తెలంగాణతో సహా దేశం అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం పూర్తిసహాయసహకారాలు అందిస్తోంది. కానీ సిఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే కేంద్రాన్ని నిందిస్తున్నారు. రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ఇంతకాలం తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం వలననే రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడు భారీగా బయటపడుతున్నాయి. కనుక ఇకనైనా సిఎం కేసీఆర్ వెంటనే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల గుప్పిట్లో చిక్కుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకొనే వరకు బిజెపి పోరాడుతూనే ఉంటుంది,” అని అన్నారు.