ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా పాజిటివ్?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో 30 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా సిఎం కేసీఆర్‌ దంపతులు గజ్వేల్‌లోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రగతి భవన్‌ను సమూలంగా శానిటైజ్ చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలలో స్నాక్స్, టీ,కాఫీలు సరఫరా చేసే కేటరింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా ముందు సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లకు వారి ద్వారా ప్రగతి భవన్‌ సిబ్బందికి కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది. అక్కడే ఉంటే సిఎం కేసీఆర్‌కు, ఆయనతో సమావేశాలకు హాజరయ్యే అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది కనుక సిఎం కేసీఆర్‌ గజ్వేల్‌ తరలిపోయినట్లు సమాచారం. 

ప్రగతి భవన్‌లో కరోనా వ్యాపించడం ఒక సమస్య కాగా, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం మరో సమస్యగా మారుతుంది. సిఎం కేసీఆర్‌ తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌కు వెళ్ళదలిస్తే అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. లేకుంటే ప్రగతి భవన్‌ పూర్తిగా కరోనా రహితమయ్యిందని నిర్ధారించుకొనే వరకు హైదరాబాద్‌లోనే వేరే ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటుచేసుకోవలసి ఉంటుంది.