తెలంగాణ ప్రభుత్వంపై మళ్ళీ హైకోర్టు గుస్సా

కరోనా కేసులు, పరీక్షలు, వివరాల విషయంలో హైకోర్టు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల రెండు రోజులు కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఐసిఎంఆర్ నిబందనల ప్రకారమే నడుచుకొంటున్నామని పదేపదే చెపుతూ అందుకు విరుద్దంగా కరోనా పరీక్షలు నిలిలిపివేయడాన్ని తప్పు పట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతిరోజూ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌లలో కూడా పూర్తి వివరాలుకు ఇవ్వకుండా చాలా దాపరికంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా పరీక్షలు, హెల్త్ బులెటిన్‌ల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీరుమారడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్రబృందం హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు దాని పరిశీలనలో తేలిన అంశాలను హైకోర్టుకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనాకు సంబందించి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం ఈనెల 17లోగా తప్పనిసరిగా అమలుచేయాలి లేకుంటే ఈనెల 20న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమీషనర్ కోర్టుకు రప్పించవలసి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.