సిఎం కేసీఆర్‌కు అభినందనలు: డెప్యూటీ నేవీ చీఫ్

చైనా సైనికుల దాడిలో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19మంది జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధికసాయం అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలబడినందుకు సిఎం కేసీఆర్‌ను అభినందిస్తూ ఇండియన్ నేవీ డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ఓ లేఖ వ్రాశారు. తాను కూడా కల్నల్ సంతోష్ బాబు చదువుకొన్న విజయనగరం వద్దగల కోరుకొండ సైనిక్ స్కూలులోనే చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని, ఓ పూర్వ విద్యార్ధి హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ లేఖ వ్రాస్తున్నట్లు చెప్పారు. కల్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిన తరువాత సిఎం కేసీఆర్‌ స్పందించిన తీరు, స్వయంగా సూర్యాపేటకు వెళ్ళి కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి ఆదుకోవడం చాలా అభినందనీయమన్నారు.

కల్నల్ సంతోష్ బాబుతో పాటు చనిపోయిన 19 మంది జవాన్ల కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధికసాయం ప్రకటించి సిఎం కేసీఆర్‌ తన మానవీయతను చాటుకొన్నారని ఎంఎస్‌ పవార్‌ లేఖలో ప్రశంసించారు. మాతృభూమి రక్షణ కోసం భారత సైనికులు ప్రణాత్యాగానికి కూడా వెనకాడరనే వాస్తవాన్ని కల్నల్ సంతోష్ బాబు, అమరజవాన్లు మరోసారి నిరూపించారని, వారి కుటుంబాలకు అండగా నిలబడినందుకు సిఎం కేసీఆర్‌కు డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ఈ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.