
సిఎం కేసీఆర్ ఈరోజు ఉదయం మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో అర్బన్ పార్క్‌లో మొక్కలునాటి హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకప్పుడు పచ్చటి దట్టమైన అడవులతో నిండి ఉండే నర్సాపూర్‌లో సినిమావాళ్ళు షూటింగులు జరుపుకొనేవారు. కానీ సమైక్య రాష్ట్రంలో నర్సాపూర్‌లో అడవులన్నీ చూస్తుండగానే మాయం అయిపోయాయి. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. కానీ ఇప్పుడు తెలంగాణ అడవులలో నుంచి పూచీకపుల్ల దొంగతనం చేసినా విడిచిపెట్టేది లేదు. కలప దొంగలను కటినంగా శిక్షిస్తున్నాము. పోయిన అడవులను మళ్ళీ ఎలాగూ వెనక్కు తీసుకురాలేము కనుక మనమే మొక్కలునాటి అడవులు పెంచాలి. ఇది ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు. అందరం కలిసికట్టుగా పనిచేసి సాధించుకోవాలి.
మన ఇంటిని మనం రోజూ ఏవిధంగా శుభ్రపరుచుకొంటామో అదేవిధంగా మన గ్రామాలను, పట్టణాలను కూడా అలాగే శుభ్రపరుచుకోవాలి. ఎక్కడికక్కడ మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి. ఎప్పుడూ అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ గొప్పదనం గురించి చెప్పుకోవడం కాక మనమే ఆ స్థాయిలో మన ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకొని చూపాలి. ఒకప్పుడు మన తాతముత్తాతలు వేసిన మొక్కలే నేడు మనకు నీడ నిస్తున్నాయి. అదేవిధంగా మనం కూడా మన భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతారణాన్ని అందజేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రజలందరూ ఇది నా ఊరు... నా రాష్ట్రం.. నా దేశం అనుకొని చేయిచెయి కలిపి పనిచేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది.
తెలంగాణ మన చేతికి వచ్చేసరికి రాష్ట్రంలో విద్యుత్ సమస్య, త్రాగు, సాగు నీటి కొరత ఉండేవి. ఆ సమస్యలన్నిటినీ శాస్వితంగా పరిష్కరించుకొన్నాము. రైతన్నల కోసం ప్రభుత్వం ఎంత చేయగలదో అంతా చేస్తుంది. మూస వ్యవసాయ విధానాల వలన నష్టపోతున్న రైతులకు లభ్ది చేకూర్చేందుకే నియంత్రిత రైతు విధానం అమలుచేస్తున్నాము తప్ప రైతులకు నష్టం కలిగించడానికి కాదని రైతన్నలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
రాష్ట్రం ఏర్పడక మునుపు పర్యావరణ విధ్వంసం జరిగింది. దానినీ సరిదిద్దుకొనే ప్రయత్నంలోనే రాష్ట్రవ్యాప్తంగా గత ఆరేళ్ళలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుకొన్నాము. తత్ఫలితంగా రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరిగింది. ఈసారి కూడా హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటుతున్నాము. వాటిని వేసి వదిలేయకుండా మనమే కాపాడుకోవాలి. తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమే. కరోనా కారణంగా మూడు నెలలు అందరి జీతాలు కోసినప్పటికీ గ్రామాలకు, మునిసిపాలిటీలకు పైసా తగ్గించకుండా డబ్బు పంపుతూనే ఉన్నాము. మెదక్ జిల్లాలోని ఒక్కో గ్రామానికి రూ.20 లక్షలు, ఒక్కో మండల కేంద్రానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులలో ఒకేసారి అంత సొమ్ము పంపలేను కనుక రెండు వాయిదాలలో పంపిస్తాము. దానితో జిల్లాలో ప్రతీ గ్రామం అభివృద్ధి చేసి చూపాలి,” అని సిఎం కేసీఆర్ అన్నారు.