
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుదవారం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) ఆసుపత్రిని సదర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికే ఈ ఆసుపత్రిలో అవుట్ పేషంట్ సేవలు మొదలయ్యాయి. నాలుగైదు రోజులలోనే ఇన్ పేషంట్ వైద్య సేవలు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం 1,264 పడకలుండగా వాటిలో 1,000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. మరో 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉంది.
గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వైద్యానికే పరిమితం చేశాము. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులను కాపాడుతున్నారు. కానీ కొందరు పనికట్టుకొని వారిపై అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. మన ప్రాణాలు కాపాడుతున్న వైద్యుల పట్ల మనం ఇలాగేనా ప్రవర్తించేది? ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడంలేదంటూ మరికొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఐసిఎంఆర్ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అవసరమైతే నిరంతరంగా పరీక్షలు చేస్తూనే ఉంటాము. ప్రజారోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. కానీ కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఎవరూ ఆసుపత్రులకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరం లేకపోయినా ఆసుపత్రులకు వస్తే కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులపై ఒత్తిడి పెరుగుతుంది. కరోనా అంటుకొనే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే అవసరం లేకపోయినా అనుమానంతో ప్రైవేట్ ల్యాబ్లు, ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు చేయించుకొని డబ్బు వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే జిల్లా స్థాయి ఆసుపత్రులలో కూడా ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తాము. అప్పుడు హైదరాబాద్లో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది,” అని అన్నారు.