
రాష్ట్ర బిజెపి అధ్వర్యంలో శనివారం జరిగిన ‘తెలంగాణ జన్ సంవాద్’ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వాటికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కరోనా విషయంలో కేంద్రాన్ని ముందుగా హెచ్చరించింది సిఎం కేసీఆరే. తక్షణం అంతర్జాతీయ విమానసేవలను నిలిపివేసి దేశంలో లాక్‌డౌన్ విధించి కరోనాను కట్టడి చేయాలని లేకపోతే దేశం మరో అమెరికాలాగ మారుతుందని సిఎం కేసీఆర్ ఆనాడే ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నాలు చేసింది. ఆ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు అన్నీ అదుపులో ఉన్నాయి.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలు కూడా కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, తీసుకొంటున్న జాగ్రత్తలను, చేసిన ఏర్పాట్లను అన్నిటినీ స్వయంగా పరిశీలించి అభినందించి వెళ్ళాయి. తెలంగాణలో పరీక్షలు జరిపిన కేంద్రబృందాలు 82 శాతం ‘నెగెటివ్’ అని రిపోర్ట్ ఇచ్చాయి. అయితే తమ క్రింద పనిచేసే అధికారుల బృందమే ఇచ్చిన ఆ నివేదికలను కూడా పట్టించుకోకుండా జేపీ నడ్డా నోటికి వచ్చినట్లు సిఎం కేసీఆర్ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. అంటే ఆ అధికారులపై..వారిచ్చిన నివేదికలపై కేంద్రానికి నమ్మకం లేదన్నమాట!
ఐసిఎంఆర్ రోజుకో రకమైన మార్గదర్శకాలు ఇస్తున్నప్పటికీ వాటిని తూచాతప్పకుండా పాటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కేసీఆర్ సమావేశమైనప్పుడు దేశ ప్రజలహితం కోసం కేంద్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా తూచాతప్పకుండా పాటిస్తామని చెప్పింది సిఎం కేసీఆర్. వైద్యులు, వైద్య, మునిసిపల్ సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలకు పిలుపునిచ్చినప్పుడు ఇతర పార్టీలు ఆయనను అవహేళన చేస్తుంటే, ‘అది తప్పు...దేశప్రధాని మాటను అందరూ గౌరవించాలని’ సిఎం కేసీఆర్ గట్టిగా చెప్పడమే కాక స్వయంగా ఆచరించి ప్రధాని మోడీకి మద్దతు పలికారు.
కేంద్రానికి ఇంతగా మద్దతు ఇస్తున్న సిఎం కేసీఆర్ గురించి జాతీయస్థాయి నాయకుడైన జేపీ నడ్డా ఓ గల్లీ స్థాయి నాయకుడి కంటే నీచంగా మాట్లాడారు. కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న ఆయన బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న కరోనా గురించి, అక్కడి కేసులు, మరణాల గురించి దేశప్రజలకు సంజాయిషీ చెప్పుకోగలరా?కరోనాపై దృష్టిపెట్టవలసిన ఈ సమయంలో అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అధికారం చేజిక్కించుకొనేందుకు బిజెపి నీచరాజకీయాలు చేస్తోంది. జాతీయస్థాయిలో కరోనా మరణాల 3.5 శాతం ఉంటే, తెలంగాణలో 3.0 శాతం ఉంది. కానీ జాతీయ స్థాయి కంటే తెలంగాణలో మరణాల శాతం ఎక్కువగా ఉందని అబద్దాలు చెప్పారు. బిజెపి తీరు శవాలపై పేలాలు ఏరుకొనే విధంగా ఉంది. జాతీయస్థాయి నాయకుడైన జేపీ నడ్డా ఇటువంటి శవరాజకీయాలు చేయడం తగదని సూచిస్తున్నాను,” అని అన్నారు.