
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో శనివారం ‘తెలంగాణ జన్ సంవాద్’ కార్యక్రమం జరిగింది. ఆ సమావేశంలో జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా డిల్లీ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం ఒకే ఒక విషయంలో దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉంది. అదే అవినీతి. సాధారణంగా ప్రజావసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తుంటాయి కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తుంటుంది. మా ఇంటికి వస్తే ఏమిస్తావు? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? అనే తీరులో కేసీఆర్ ప్రభుత్వం సాగుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్‌లో ఆక్సిజన్ లభించక ఒక యువ జర్నలిస్ట్ చనిపోయాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రంలో చేసినన్ని కరోనా పరీక్షలు కూడా చేయలేకపోయింది. జాతీయస్థాయిలో కరోనా మరణాల 1.5 శాతం మాత్రమే ఉంటే, తెలంగాణలో 3.8 శాతం ఉంది. ఇదివరకు సిఎం కెసిఆర్ దేశప్రజలనుద్దేశ్యించి 'హిందూగాళ్ళు... బొందుగాళ్ళు' అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలను బట్టి ఆయన దృష్టిలో దేశప్రజలు ఎంత హీనంగా భావిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ వ్యాఖ్యలపై ఆయనే వివరణ ఈయవలసి ఉంటుంది," అని అన్నారు.
అదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు పాలిస్తున్నాయి. ఒకటి కల్వకుంట్ల కుటుంబం. రెండు ఓవైసీల కుటుంబం. ఈ రెండు కుటుంబాల చేతిలో బందీ అయిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనమందరం పొరాడి విడిపించుకోవాలి. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువస్తేనే అది సాధ్యం అవుతుంది. కనుక బిజెపి కార్యకర్తలందరూ ఆ దిశలో గట్టిగా ప్రయత్నించాలి,” అని అన్నారు.