
గాల్వాన్ వాలీలో భారత్ సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టన పెట్టుకొన్న చైనా, కొంతమంది భారత్ జవాన్లను బందీగా పట్టుకుపోయిందని మీడియాలో వచ్చిన వార్తలను భారత్ ఆర్మీ ఖండించింది. కానీ ఆ మరుసటిరోజు నుంచి మేజర్ జనరల్ స్థాయిలో ఇరుదేశాల సైన్యాధికారులు సంప్రదింపులు ఫలించడంతో ఎట్టకేలకు గురువారం చైనా సైన్యం ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం 10 మంది భారత్ జవాన్లను విడిచిపెట్టినట్లు ఈరోజు జాతీయమీడియాలో ప్రధానంగా వార్తలు ప్రచురించింది. మూడురోజులు చైనా చెరలో బందీలుగా ఉన్న వారీనందరినీ ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
భారత్ సైనికులపై దాడి చేయడానికి చైనా సైనికులు వినియోగించిన ఇనుపమేకులు వెల్డ్ చేసిన ఇనుపరాడ్లు ఆ ప్రదేశంలో లభించడం గమనిస్తే ఈ దాడికి చైనా ముందుగానే సన్నదమై వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ సైనికులను కొంతమందిని హతమార్చి, మరికొంత మందిని బందీలుగా పట్టుకుపోవడం గమనిస్తే, భారత్-చైనా దళాల మద్య ఘర్షణ యాదృచ్ఛికంగా జరుగలేదని, చైనా సైన్యం ఒక పధకం ప్రకారమే భారత్ సైనికులపై దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇంత చేసినా భారత్ సైనికులే తమ భూభాగంలోకి ప్రవేశించి తమ సైనికులను రెచ్చగొట్టారని చైనా వాదిస్తుండటం అతి తెలివి ప్రదర్శించడమే.