
హైదరాబాద్, పంజగుట్ట జంక్షన్ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌ను ఈరోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నగరం నడిబొడ్డున గల పంజగుట్ట జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ వేలాదివాహనాలు ఆ మార్గంలో పయనిస్తుంటాయి కనుక అక్కడ నిత్యం బారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండేది. కానీ అక్కడ రోడ్డు విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు నుంచి ముఫకంజా కాలేజ్ వైపుకు ఒక చిన్న ఫ్లై ఓవర్ నిర్మించినట్లయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుందని భావించి, తక్కువ ఖర్చుతో త్వరగా నిర్మించగల స్టీల్ బ్రిడ్జ్‌ను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో సాధారణంగా ఇటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. కానీ ఫిబ్రవరిలో పనులు పెట్టిన తరువాత సుమారు రెండున్నర నెలలు లాక్డౌన్ అమలులో ఉండటంతో, ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని శరవేగంగా మూడు నెలల వ్యవధిలోనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచేయగలిగారు. నగరంలో మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్ ఇదే. దీనిని 100 మీటర్లు పొడవు, 9.60 మీటర్లు వెడల్పుతో రెండు వన్ వే లేన్లతో, ఒక మీటర్ వెడల్పు కలిగిన ఫుట్ పాత్ కూడా ఉండేలా నిర్మించారు.