.jpg)
ఇప్పటివరకు తెలంగాణలో ప్రజలు, పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బందే కరోనాకు గురవుతున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనాబారిన పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన స్వయంగా కారు నడుపుకొంటూ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకొని అక్కడ ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.
బాజిరెడ్డి గోవర్ధన్ మొన్న శనివారంనాడు తన నియోజకవర్గంలో అనేక అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ విజి.గౌడ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ సుమారు 100 మందికి పైగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసినట్లు గుర్తించడంతో వారందరినీ క్వారెంటైన్‌కు తరలించారు.
బాజిరెడ్డి ఆయన భార్య, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా వారెవరికీ కరోనా సోకలేదని నిర్ధారణ అవడంతో అయ్యింది. కానీ ముందుజాగ్రత్త చర్యగా వారినీ కూడా హోం క్వారెంటైన్‌లో ఉంచారు.
ఇటీవల జనగావ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా బారిన పడటంతో హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తన వ్యక్తిగత సహాయకుడికి కరోనా సోకడంతో మంత్రి హరీష్‌రావు హోం క్వారెంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.