సిఎం కేసీఆర్‌ కొండపోచమ్మ సాగర్ ఆకస్మిక పర్యటన

సిఎం కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం మార్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్‌కు ఆకస్మికంగా పర్యటించారు. అక్కడికి వస్తున్నట్లు ముందుగా ప్రాజెక్టు అధికారులకు, మీడియాకు కూడా తెలియజేయకుండా రావడంతో జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది ఉరుకుల పరుగుల మీద అక్కడకు చేరుకొన్నారు. అయితే ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది యధాప్రకారం తమ పనులు చేసుకొంటుండటంతో వారు సిఎం కేసీఆర్‌ను చూసి ఆశ్చర్యపోయారు తప్ప కంగారుపడలేదు. సిఎం కేసీఆర్‌ ప్రాజెక్టు అంతటా కాసేపు కలియతిరిగి అక్కడ జరుగుతున్నా పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నాక కొన్ని సలహాలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి కనుక ఇంకా అవి జోరందుకోకమునుపే కొండపోచమ్మ సాగర్‌ కుడి, ఎడమ కాలువ పనులను వీలైనంత వరకు పూర్తి చేయాలని సూచించారు. సిఎం కేసీఆర్‌ వచ్చినట్లు తెలుసుకొని పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. సిఎం కేసీఆర్‌ వారితో కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.