ఆందోళన విరమించేది లేదు: జూనియర్ డాక్టర్లు

గాంధీ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి నుంచి మొదలైన జూనియర్ డాక్టర్ల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. వారితో చర్చలు ఫలించాయని వారు సమ్మె విరమించి విధులలో చేరడానికి అంగీకరించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కానీ తమ డిమాండ్లపై ప్రభుత్వం ఖచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని, అంతవరకు విధులకు హాజరుకాబోమని జూనియర్ డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్తుతం సుమారు 300 మంది జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి ఆవరణలో కూర్చొని ఆందోళన కొనసాగిస్తున్నారు.  

మంగళవారం రాత్రి ఓ కరోనా రోగి బందువు జూనియర్ డాక్టర్లపై దాడి చేయడంతో ఈ ఆందోళన మొదలైంది. ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స చేస్తున్న తమపై దాడులకు పాల్పడేవారిపై కటినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కరోనా కేసులు బయటపడినా వారిని నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చి చేరుస్తుండటం వలన తమపై విపరీతమైన పనిభారం పడుతోందని, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని కనుక జిల్లాస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే కరోనా రోగులను చేర్చుకొని తమపై ఒత్తిడి తగ్గించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. 

హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవారికంటే చేరేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. పైగా క్వారెంటైన్‌ నిబందనల ప్రకారం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిలో 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. దాంతో మిగిలినవారిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికీ కొద్ది మంది వైద్యులు, సిబ్బందితోనే అందరికీ చికిత్స చేయడం కష్టం కనుకనే తమపై ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా వైద్యులను నియమించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకేసారి 10,000 మందికి చికిత్స అందించేందుకు అవసరమైనవైద్యులు, సిబ్బంది, ఆసుపత్రులు, పరికరాలు అన్ని సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పదేపదే చెప్పారు. కనుక ఇప్పుడు వారి సేవలను ఉపయోగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.