టి-కాంగ్రెస్‌ నేతలు హౌస్ అరెస్ట్!

తెలంగాణలో కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ టి-కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ‘చలో సెక్రటేరియట్‌’ పేరిట సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు వారిని ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా అడ్డుకొంటున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ తదితరుల ఇళ్ళవద్ద పోలీసులను మోహరించి వారిని ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా అడ్డుకొంటున్నారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని ఉద్యోగులకు జీతాలలో కోతలు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మూడు నెలలపాటు అద్దెలు వసూలు చేయవద్దని ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై భారం మోపుతోంది. ఏమని ప్రశ్నిస్తే ఈవిధంగా నిర్బందిస్తోంది. కేసీఆర్‌ నిరంకుశపాలన చేస్తూ ప్రజల, ప్రతిపక్షాల గొంతు అణచివేస్తున్నారు. ఇదేమి న్యాయం?” అని ఆవేదన వ్యక్తం చేశారు.