రైతుబంధుపై అపోహలొద్దు: కేటీఆర్‌

ఈరోజు ఉదయం రంగనాయక్ సాగర్ నుంచి గోదావరి జలాలు ముస్తాబాద్ మండలంలోకి ప్రవేశించడంతో మంత్రి కేటీఆర్‌ తదితరులు బాదనకల్ చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. గోదావరి జలాలు ఇంత ఎత్తున ఉన్న మన ఊరికి వస్తాయని ఏనాడూ ఎవరూ ఊహించి ఉండరు. కానీ సముద్రమట్టానికి సుమారు 680 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తూ మన ఊళ్ళలో గోదావరి నీళ్ళను పారిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఇంతగా తపిస్తున్న సిఎం కేసీఆర్‌ అన్యాయం చేస్తారని కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు పధకం గురించి కాంగ్రెస్‌ నేతలు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలను నమ్మవద్దని నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో లాగే ఈ ఏడాది కూడా ప్రతీ రైతుకు రైతుబంధు సొమ్ము ఖాతాలో జమాచేయబడుతుంది. దాని గురించి రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదు. పంటలు ఏవిధంగా సాగు చేస్తే రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఆవిధంగా చేయాలని సిఎం కేసీఆర్‌ రైతులకు సూచిస్తున్నారు తప్ప ఎవరినీ బలవంతం చేయలేదు. రైతుల మేలు కోరే నియంత్రిత పంటల విధానం ప్రవేశపెట్టారు. దానికి రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. కానీ కాంగ్రెస్‌ నేతలు దీనిని కూడా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 70 ఏళ్ళలో చేయలేని పనులను కేవలం ఆరేళ్ళలోనే మా ప్రభుత్వం చేసి చూపిస్తోంది. అందుకు హర్షించకపోగా ప్రభుత్వంపై విమర్శలు, దుష్ప్రచారం కూడా చేస్తున్నారు,” అని కేటీఆర్‌ అన్నారు.